Current Date: 26 Nov, 2024

ప్రముఖ న్యూస్‌రీడర్ శాంతి స్వరూప్ ఇకలేరు.. జీవిత విశేషాలు!

ప్రముఖ తెలుగు యాంకర్, న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఈరోజు కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది శాంతి స్వరూప్. పేరుకు తగ్గట్టుగానే మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే.. వార్తలు, సమాచారం, ‘జాబులు- జవాబులు’, ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్రశాంతంగా చొచ్చుకుపోయేలా చేసిన శాంతి స్వరూప్.. నేటి తరం యాంకర్లకు ఆదిగురువు.

తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్‌ శాంతిస్వరూప్. 1978లో ఆయన దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా ఆయనకే అవకాశం దక్కింది. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేసి... ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివారు.

శాంతి స్వరూప్‌కి బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త ఏది అని ఆయనను ఓసారి ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు. మొదటి విషాదకరమైన వార్త ప్రధాని ఇందిరాగాంధీ మరణం.. ఇందిరాగాంధీ మరణించారని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. 16 బుల్లెట్లు ఆమె ఒంటికి తగిలాయి ఆమె మరణం ఒక సంచలనం అని అన్నారు. రెండో వార్త ఏది అని అడగితే. ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త చెప్పారు. ఇందిరాగాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణము చాలా దారుణమని.. ఆయన శరీరం ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు గుర్తుండి పోయిందని వెల్లడించారు.