మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన 'లేచింది మహిళా లోకం' చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మహిళా ప్రాధాన్యత ఉన్న ఈ సినిమాను మగాళ్లు చూడకపోయినా పర్వాలేదని, కానీ మహిళలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్లకు రావాలని ఆమె కోరారు. ఈ చిత్రంలో తన తండ్రి మోహన్ బాబు 'ఫిష్ అండ్ ఫిషర్ మెన్', తమ్ముడు మంచు విష్ణుకి సంబంధించిన 'లెట్ దెం నో' ఫేమస్ డైలాగులను తన ప్రమేయం లేకుండానే దర్శకుడు చేర్చారని లక్ష్మి స్పష్టం చేశారు. అలాగే 'పుష్ప 2' కంటే ముందే తాము 'వైల్డ్ ఫైర్' అనే డైలాగ్‌ను వాడామని, సుకుమార్ కంటే ముందే ఈ క్రెడిట్ తమకే దక్కుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రోలింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ఒకప్పుడు విమర్శలకు భయపడేదాన్నని, కానీ ఇప్పుడు వాటిని అస్సలు పట్టించుకోవడం లేదని, తన పని తాను చేసుకుంటూ వెళ్తానని కుండబద్దలు కొట్టారు. నిర్మాతగా ప్రస్తుతం తనకు విరామం అవసరమని, ఇకపై సినిమాలు నిర్మించే ఉద్దేశం లేదని మంచు లక్ష్మి ప్రకటించారు. కథలు పట్టుకుని తన దగ్గరకు రావొద్దని, కేవలం నటిగా మాత్రమే సంప్రదించాలని కోరారు. అనన్య నాగళ్ల, హేమ, సుప్రీత, శ్రద్ధాదాస్, హరితేజ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Share