పెళ్లి వేడుకకు హాజరు అయ్యేందుకు ఓ మూడేళ్ల చిన్నారి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్లింది. తీరా అక్కడి వెళ్లిన తరువాత కారులోంచి అందరూ దిగిపోయారు. ఆ చిన్నారి మాత్రం కారులోనే పడుకుని ఉంది. ఆ విషయాన్ని మరిచిపోయిన తల్లిదండ్రులు ఎంచక్కా పెళ్లి వేదిక వద్దకు వెళ్లి సన్నిహితులు, ఫ్రెండ్స్‌తో మాట్లాడడంలో బిజీ అయ్యారు. కొన్ని గంటలు గడిచిన తరువాత వారికి విషయం గుర్తుకు వచ్చింది. తీరా వచ్చి చూసేసరికి ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రదీప్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి కారులో ఓ వివాహవేడుకకు వెళ్లాడు. ఫంక్షన్ హాల్‌కు చేరుకున్న తరువాత భార్యతో పాటు పెద్ద కూతురు కారులోంచి దిగారు. చిన్నకూతురు కూడా వారితోనే దిగిందని భావించిన ప్రదీప్ కారును పార్కింగ్ ఏరియాలోకి తీసుకువెళ్లి అక్కడ కారును పార్క్ చేసి డోర్ లాక్ చేశాడు.
అప్పటికే భార్య, పెద్ద కూతురు పంక్షన్ హాల్ లోపలికి వెళ్లగా ఆ తరువాత అతడు కూడా వెళ్లాడు. వారిద్దరూ విడివిడిగా దాదాపు రెండుగంటల పాటు పెళ్లికి వచ్చిన వారితో మాట్లాడారు. ఆ తరువాత ఒకరినొకరు కలుసుకున్న తరువాత చిన్నకూతురు గోర్విక ఎక్కడ అంటూ ఇరువురు ప్రశ్నించుకున్నారు. ఆందోళన వారు చుట్టు పక్కల అంతా వెదికారు. చివరకు కారు వద్దకు వచ్చి చూడగా వెనుకసీటులో అచేతనంగా పడి ఉన్న గోర్వికను చూశారు.
వెంటనే ఆస్పత్రికి తరలించగా ఊపిరిఆడక అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా.. కూతురు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు తల్లిదండ్రులు నిరాకరించినట్లు పోలీసులు చెప్పారు. దీనిపై ఫిర్యాదు కూడా చేయలేదన్నారు.