Current Date: 23 Jun, 2026

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా గొర్రెల కాపరి!

ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో బలమైన బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ అద్భుత డ్రాతో సరిపెట్టుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు బెల్జియం అలవోకగా గెలుస్తుందని అందరూ భావించినప్పటికీ, ఇరాన్ గోల్‌కీపర్ అలీరెజా బెల్జియం ఆటగాళ్లకు సింహస్వప్నంగా మారాడు. ఆ మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఏకంగా 23 సార్లు ఇరాన్ గోల్ పోస్ట్‌పై దాడులు చేసింది. అయితే, అలీరెజా గోడలా నిలిచి, ఏడుసార్లు ఖాయమనుకున్న గోల్స్‌ను అద్భుతంగా తప్పించి తన జట్టును ఓటమి నుంచి కాపాడాడు.ప్రస్తుత ప్రపంచకప్‌లోనే కాకుండా 2018 ప్రపంచకప్‌లో పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో సాక్షాత్తూ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన పెనాల్టీ షాట్‌ను అడ్డుకుని, 2022 ప్రపంచకప్‌లోనూ తన కీపింగ్ నైపుణ్యంతో అతడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ స్థాయికి చేరడానికి అలీరెజా పడిన కష్టాలు, చేసిన పోరాటం ఎందరికో స్ఫూర్తిదాయకం. లోరెస్థాన్‌ ప్రావిన్స్‌లో గొర్రెలు మేపే తండ్రికి పెద్ద కొడుకుగా పుట్టిన అలీరెజాకు చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే ప్రాణం. కానీ, తండ్రికి అది ఇష్టం లేకపోవడంతో, ఫుట్‌బాల్ మాటెత్తితే కొట్టేవాడు.ఆశయ సాధన కోసం బంధువుల దగ్గర కొంత డబ్బు తీసుకుని ఇంట్లోంచి పారిపోయిన అలీరెజా, టెహ్రాన్‌కు చేరుకుని ఒక స్థానిక క్లబ్‌లో చేరాడు. మొదట్లో స్ట్రైకర్‌గా ఆడిన అతడు, ఒకసారి రెగ్యులర్ గోల్‌కీపర్‌కు గాయం కావడంతో ఆ బాధ్యతలు అందుకుని, ఆ తర్వాత దాన్నే తన శ్వాసగా మార్చుకున్నాడు. సరైన వసతి లేక ప్రాక్టీస్ ముగిశాక రాత్రి పూట మసీదుల్లో, ఒక్కోసారి రోడ్ల మీదే నిద్రపోయేవాడు. 2015లో ఇరాన్ సీనియర్ జాతీయ జట్టులో అరంగేట్రం చేసి, నేడు ప్రపంచ ఫుట్‌బాల్‌ రంగంలోనే అత్యుత్తమ గోల్‌కీపర్‌లలో ఒకడిగా ఎదిగి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.