విశాఖపట్నంలో దాదాపు ఐదేళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి ఆచూకీ అనూహ్యంగా లభ్యమై, ఆమె కుటుంబ సభ్యులను చేరింది. సబ్బవరం మండలం గొల్లలపాలెం శివారు అమరపినివానిపాలేనికి చెందిన ఒక యువతి 2021లో తప్పిపోయిందంటూ ఆమె తల్లి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఎంత గాలించినా అప్పట్లో ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కన్నకూతురు మళ్లీ తిరిగి వస్తుందనే ఆశలను ఆమె కుటుంబ సభ్యులు పూర్తిగా వదులుకున్నారు. వాస్తవానికి ఆ యువతి తప్పిపోలేదు. పరవాడ మండలం లంకెలపాలెంలోని తన బంధువుల ఇంటి వద్ద ఉంటున్న సమయంలో ఆమెకు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన ఒక యువకుడితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరికీ చెప్పకుండా తిరుపతికి వెళ్లిపోయారు. అక్కడే వివాహం చేసుకుని, ఇన్నాళ్లూ తిరుపతిలోనే కాపురం ఉంటున్నారు. సదరు యువతి ఇటీవల తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించడానికి వెళ్ళింది. అక్కడ అడ్మిషన్ కోసం బిడ్డ ఆధార్ కార్డ్‌తో పాటు, తన ఆధార్ కార్డ్‌ను కూడా అధికారులకు సమర్పించింది. ఆ వివరాలను మాతాశిశు సంక్షేమ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించగా, అప్పట్లో పోలీసులు సర్క్యులేట్ చేసిన తప్పిపోయిన యువతి వివరాలతో సరిపోలాయి. దీంతో ఆ యువతిని, ఆమె భర్త, కుమారుడితో సహా తల్లి కుటుంబానికి సురక్షితంగా పోలీసులు అప్పగించారు.
Share