టాలీవుడ్ సెన్సేషనల్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గత వారం ఉదయ్‌పుర్ వేదికగా అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, ఆదివారం దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో అన్నదానం, స్వీట్ల పంపిణీ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 4న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సంబంధించి రష్మిక మందన్న స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబాన్ని రిసెప్షన్‌కు ఆహ్వానించారు. రష్మికను సాదరంగా ఆహ్వానించిన రేవంత్ రెడ్డి దంపతులు, తెలుగు సంప్రదాయం ప్రకారం ఆమెకు చీర పెట్టి ఘనంగా సత్కరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకుముందే విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమంత్రిని కలిసి ప్రాథమికంగా ఆహ్వానం అందించిన సంగతి తెలిసిందే. రిసెప్షన్ నేపథ్యంలో 'విరోష్' జోడీ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసు ఆంక్షలు, అతిథుల పరిమితి దృష్ట్యా, ఆహ్వానం ఉన్నవారు మాత్రమే రావాలని, అభిమానులు అక్కడికి వచ్చి ఇబ్బంది పడొద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం కొద్దిమంది సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుంది.
Share