Current Date: 03 Mar, 2026

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నూతన వధువు దారుణం.. అంచనా నిజమైంది!

బెంగళూరులోని బాగలకుంటె ప్రాంతానికి చెందిన విద్యాజ్యోతి (29) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒక జ్యోతిష్కుడి మూఢనమ్మకాల మాటలకు బలికావడం తీవ్ర కలకలం రేపింది. కొడగుకు చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె, వివాహమైన తొమ్మిది రోజులకే ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న సమయంలో ఒక జ్యోతిష్కుడు ఆమె భవిష్యత్తు గురించి చెప్పిన అవాస్తవాలు, ఆమెను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేశాయి. "నువ్వు ఎక్కువ కాలం బతకలేవు, నీ నూకలు చెల్లిపోతాయి" అంటూ సదరు జ్యోతిష్కుడు ఆమెను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె ప్రాణాలను కాపాడుకోవాలంటే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయాలని, చివరి రోజైన శుక్రవారం నాడు తన తాళిని తీసి అమ్మవారికి సమర్పించాలని సూచించాడు. ఆ జ్యోతిష్కుడి మాటలను గుడ్డిగా నమ్మిన విద్యాజ్యోతి, ఆయన చెప్పినట్లే పూజలు చేస్తూ తీవ్ర భయంతో కాలం గడిపింది. చివరి రోజైన శుక్రవారం నాడు తాళిని అమ్మవారికి సమర్పించే క్రమంలో, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఒక విద్యావంతురాలైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇలాంటి మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.