సింహగిరి ప్రదక్షిణలో అత్యంత కీలక పాత్రపోషించేవి టెంకాయలు. తొలిమెట్టు వద్ద టెంకాయ కొట్టనిదే భక్తుల ప్రదక్షిణ మొదలుకాదు. ఈనేపథ్యంలో అప్పన్న సాక్షిగా లక్షల కొబ్బరికాయలు పగిలాయి. మనసులోని కోరికలను అప్పన్న స్వామికి నివేదించుకుని భక్తులు పెద్ద మొత్తంలో టెంకాయలు పగలు గొట్టారు. గత ఏడాది 10 లక్షల వరకు టెంకాయలు పగిలినట్టు ఒక అంచనా. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.భక్తులు కొట్టిన టెంకాయ ముక్కలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసుకుని లారీల్లో తరలిస్తున్నారు. దేవస్థానం పాత గోశాల నుండి పాత అడివి వరం కొరకు దారి పొడవునా టెంకాయలు దుకాణాలు వెలసిపోయాయి. సాదరంగా టెంకాయలు అమ్మే వ్యాపారులతో పాటు ఒక్కరోజు వ్యాపారం కోసం దుకాణాలు పెట్టేశారు. ఒక్కొక్క టెంకాయ ముప్పై నుండి 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు.