Current Date: 05 Oct, 2024

పరువునష్టం కేసులో రాహుల్‌కు ఊరట బెయిల్‌ మంజూరు చేసిన ప్రత్యేక న్యాయస్థానం

 పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  కి ఊరట లభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. వార్తా పత్రికల్లో కాంగ్రెస్‌ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ.. బీజేపీ కర్ణాటక శాఖ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్‌ కోర్టులో హాజరయ్యారు.గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40శాతం కమీషన్‌ వసూలు చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిందని, ‘40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించిందని పేర్కొంటూ కమలం పార్టీ నేత కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరఫున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ హస్తం పార్టీ పోస్టర్లు అతికించిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది. అలాగే సహ నిందితుడిగా ఉన్న రాహుల్‌ జూన్‌ 7న కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.