Current Date: 26 Nov, 2024

స్టీల్‌ప్లాంట్‌లో ‘నీరు’తొండ!

స్టీల్‌ప్లాంట్‌ ఇంటక్‌ సంఘం నాయకుడు నీరుకొండ రామచంద్రరావు తినే తిండి కాంగ్రెస్‌ది..పడుకునేది మాత్రం గాజువాక వైసీపీ పక్కలో అంటూ ఇంటక్‌ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు.  స్టీల్‌ప్లాంట్‌ను కాపాడ్డానికి ఏ రోజూ కృషి చేయని గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్‌ వెంట ప్రచారానికి వెళ్ళడాన్ని ఇంటక్‌ శ్రేణులు ఛీ కొడుతున్నాయి. అన్నం పెడుతున్న స్టీల్‌ ప్లాంట్‌ ను కాపాడడానికి పరిశ్రమల మంత్రిగా ఏ మాత్రం సహకరించని గుడివాడ అమరనాథ్‌ వెనుక ఓ బాధ్యత గల కార్మిక నాయకుడు తిరగడాన్ని దుయ్యబడుతున్నారు. కార్మికుల పక్షాన పని చేస్తాడని ఆయన్ను నేతగా ఎన్నుకుంటే ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ గురించి కనీసం పట్టించుకోని అమర్‌ వెనుక ప్రచారానికి వెళ్తుండడాన్ని కార్మిక కుటంబాలూ ఛీ కొడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధంగా ఐఎన్‌టీయూసీ (ఇంటక్‌) నడుస్తోంది. అలాంటి విభాగానికి అధ్యక్షునిగా ఉన్న నీరుకొండ రామచంద్రరావు ఇప్పుడు అమ్ముడుపోవడాన్ని ప్లాంట్‌ కార్మికులు దిగమింగుకోలేకపోతున్నారు. కోకింగ్‌ కోల్‌ లేక ప్లాంట్‌ కష్ట కాలంలో ఉన్నప్పుడు కనీసం పట్టించుకోని నీరుకొండ వైసీపీ ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొనడాన్ని కార్మికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ఇంటక్‌..గాజువాకలో కాంగ్రెస్‌ బలపర్చిన ఇండియా కూటమి అభ్యర్థికి కూడా నీరుకొండ మద్దతునివ్వాల్సి ఉంది. కానీ కాంగ్రెస్‌ అభ్యర్థికి నీరుకొండ మొహం చాటేసి వైసీపీ రథం ఎక్కడాన్ని కార్మికులు వేలెత్తి చూపిస్తున్నారు. దీన్నిబట్టి ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఉద్యమంలో నీరుకొండ ఎటువంటి శకుని పాత్ర పోషిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చని కార్మికులు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి నాయకుల వల్లే స్టీల్‌ప్లాంట్‌ నిలువునా మునిగిపోతోందని కర్యకర్తలు వెల్లడిరచారు.