Current Date: 27 Nov, 2024

కోహ్లీని పట్టించుకోని బీసీసీఐ.. గొడవలకి బీజం?

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ నియామకం విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సంప్రదించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలతో మాత్రమే కొత్త కోచ్ ఎంపిక గురించి చర్చించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.వాస్తవానికి విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య దశాబ్దకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. పలు సందర్భాల్లో ఇద్దరూ మైదానంలోనే గొడవపడ్డారు. ఇక ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలకి లెక్కేలేదు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇద్దరూ ఢిల్లీకి చెందిన క్రికెటర్లే. దాంతో గంభీర్ నియామకానికి ముందు విరాట్ కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ జట్టు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న బీసీసీఐ.. ఈ నియామకం విషయంలో విరాట్ కోహ్లీని విస్మరించినట్లు తెలుస్తోంది. 2027 వరకు గంభీర్ హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగే అవకాశం ఉంది. కానీ గంభీర్ హెడ్ కోచ్‌గా సీనియర్లకు అవకాశం ఇస్తాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Share