Current Date: 06 Jul, 2024

వేల కోట్లు దాటిన ‘మెగా’ దగాలు

సుప్రీంకోర్టు ఎలక్టోరల్‌ బాండ్స్‌ను రద్దు చేసినప్పటికీ ఆర్థిక నేరస్తులు తమ పలుకుబడిని వుపయోగించుకొని ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా కలుగజేస్తున్నారని చెప్పడానికి తాజా ఉదాహరణ మెగా కృష్ణారెడ్డి. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల్లో కాంట్రాక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు కాజేసినట్టు ఆరోపణలు వున్న మెగా కృష్ణా రెడ్డి ఎక్కడికక్కడ ఆయా అధికార పార్టీలకు రాజమార్గంలో భారీగా లంచాలను ముట్టజెప్పిన వ్యవహారంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. తన ఖాతాల నుంచి ఇప్పటికీ 966 కోట్ల రూపాయల ఎలక్టోరల్‌ బాండ్స్‌ను కొనుగోలు చేసి అధికార పార్టీలకు సమర్పించారు. ఇంత పెద్ద మొత్తాన్ని లంచంగా ఇచ్చారంటే మరి ఇంకెంత మొత్తం కాజేశారో తెలుసుకోడానికి ప్రజలు ఉత్సాహ పడుతున్నారు. పన్నెండు వేల కోట్ల రూపాయల జీఎస్‌టీని ఎగ్గొటడానికే ఈ అధికార పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా ముడుపులు చెల్లించుకున్నారనే ఆరోపణలు బలంగా వున్నాయి. ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలూ ప్రభుత్వ ఖజానాకు వెల్లవలసిన సొమ్ము. కానీ కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్స్‌ను చెల్లించి మెగా కృష్ణారెడ్డి ఈ పన్నెండువేల కోట్ల రూపాయల జీఎస్‌టీ బకాయికి ఎగనామం పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2020 డిసెంబరు నెలలో హైదరాబాద్‌లోని జీఎస్‌టీ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ బాలాజీ మజుందార్‌ మెగా కంపెనీలకు సంబంధించి 12వేల కోట్ల రూపాయల జీఎస్‌టీ చెల్లించాలని నిర్ధారించి నోటీసు పంపారు. అంతే రెండు నెలలు తిరగకుండానే మజుందార్‌ 2021 ఫిబ్రవరి 11వ తేదీన తన ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి వెళ్ళిపోయారు ? వాస్తవానికి 2028 వరకూ మజుందార్‌ పదవీకాలం వుంది. అంటే మెగా  కృష్ణారెడ్డి ప్రభుత్వ పెద్దలకు ఆమ్యామ్యాలు తడిపి ఒక నిజాయితీ పరుడైన ఉన్నతాధికారిని ఏ విధంగా ఇంటికి పంపించేశారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ మెగా కృష్ణారెడ్డి ఈ జీఎస్‌టీ మొత్తాన్ని చెల్లించలేదు. కేంద్రం ఈ కేసును పెండిరగ్‌లో పెట్టిందంటే అధికార పార్టీకి అందిన ఎలక్టోరల్‌ బాండ్స్‌ మహత్స్యమేనన్న మాట. ఇలా మెగా చేసిన దగాలు కోకొల్లలు. కానీ ఎలక్టోరల్‌ బాండ్స్‌ పుణ్యమా అని ఏ కేసూ విచారణకు నోచుకోవడం లేదు. మరి చిన్న చిన్న ఆర్థిక నేరాలకే ఈడీలను, సీబీఐలను పంపే మోడీ ప్రభుత్వ ఆదాయానికే గండి కొట్టి ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఎగవేసే మెగా స్కామ్‌లపై మోడీ ఎందుకు విచారణ జరపడం లేదు? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.