ఏపీలో జూన్ 4వ తేదీన వెలువడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఆర్‌వో సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా ఇచ్చిన మెమోపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను గురువారమే అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. తాజాగా పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.