Current Date: 04 Jul, 2024

తీహార్ జైల్లో ఢిల్లీ సీఎంకి కొత్త చిక్కులు.. నెక్ట్స్ వీక్ నుంచి సవాళ్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. అధికారులతో సమావేశాలు, జైలు నుంచే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు జైలు అధికారులు సరైన సౌకర్యాలు, వసతులు కల్పించడం లేదని.. ఢిల్లీ సీఎంను కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సంజయ్ బనివాల్ ఖండించారు. కుటుంబ సభ్యులతో నేరుగా ములాఖత్ అయ్యే అవకాశాన్ని తీహార్ జైలు అధికారులు కల్పించడం లేదని వస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టారు. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. జైలులో ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు.

ఢిల్లీ పాలనకు సంబంధించి వచ్చే వారం నుంచి ఇద్దరు మంత్రులతో తాను భేటీ అవుతానని కేజ్రీవాల్‌ చెప్పడంపైనా స్పందించిన సంజయ్ బనివాల్.. వారు అందించే పత్రాలు న్యాయపరమైన, ఫిర్యాదులకు సంబంధించినవే ఉండాలని స్పష్టం చేశారు. తాజాగా జైళ్ల శాఖ డీజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైలు నుంచే కేజ్రీవాల్‌ తర్వాతి ఆదేశాలు ఎలా ఇవ్వనున్నారనే విషయంపై ఆసక్తి నెలకొంది