Current Date: 01 Oct, 2024

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ హైదరాబాద్‌లో అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌పై కేసు నమోదవగా.. ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సురేష్‌ను అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు ఇంటికి వెళ్లారు. కానీ.. అరెస్టు భయంతో మాజీ ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నందిగం సురేష్ మొబైల్ సిగ్నల్స్‌ ఆధారంగా.. పోలీసులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో ఆరా తీశారు. చివరికి హైదరాబాద్‌లో ఉన్నారని గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం ప్రత్యేక బలగాల ద్వారా మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఉన్న నిందితులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, నందిగం సురేష్‌‌తో పాటూ పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం వెతుకుతున్నారు. అరెస్ట్ భయంతో వీరంతా ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేయగా బుధవారం వాటిని కోర్టు కొట్టేసింది.

Share