సొంతగడ్డపై భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో 3-0 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవాలంటే ఆస్ట్రేలియా పై 4-0 తేడాతో విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. నవంబర్ 22న పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇక ఈ సిరీస్‌కు భారత్ సన్నద్దమవుతున్న తీరును టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తప్పుపట్టాడు. వాస్తవానికి తొలి టెస్టుకు ముందు భారత్-ఏతో జట్టుతో టీమ్ఇండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే.. వర్క్‌లోడ్, ఆటగాళ్లు గాయపడతారంటూ అంటూ భారత్ చివరి నిమిషంలో దీన్ని రద్దు చేసుకుంది. దీనిపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు నెట్ ప్రాక్టీస్‌కు చాలా తేడా ఉంటుందని చెప్పాడు. భారత్ పై 3-0 తేడాతో విజయం సాధించిన తరువాత కూడా న్యూజిలాండ్ జట్టు ముంబైలో ప్రాక్టీస్ చేసిన విషయాన్ని ప్రస్తావించాడు. సన్నాహక మ్యాచ్‌ను రద్దు చేయడం బుద్ది తక్కువ నిర్ణయం అని అన్నాడు.