Current Date: 27 Nov, 2024

బంగ్లాపై తొలి టెస్టులో భారత్ పరువు నిలిపిన అశ్విన్

చెన్నై వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో లోక‌ల్ బాయ్‌ అశ్విన్ భారత్ పరువు నిలిపాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి స్టార్ క్రికెట‌ర్లు విఫ‌ల‌మైన చోట ఈ వెటరన్ ఆల్‌రౌండర్ శతకంతో విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ తన విరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు.ర‌వీంద్ర జ‌డేజాతో క‌లిసి ఏడో వికెట్‌కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని అశ్విన్ నెలకొల్పాడు. ఈ క్ర‌మంలో కేవలం 108 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో త‌న సెంచ‌రీ మార్క్‌ను ఈ స్పిన్ మాస్ట్రో చేరుకోవడం విశేషం. ప్ర‌స్తుతం అశ్విన్ 102 ప‌రుగుల‌తో క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. కాగా అశ్విన్‌కు ఇది ఆరో టెస్టు సెంచ‌రీ. భారత్ జట్టు తొలి రోజు 339/6తో మెరుగైన స్థితిలో నిలిచింది.ఒకే వేదిక‌లో రెండు టెస్టు సెంచ‌రీల‌తో పాటు అత్య‌ధిక ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ రికార్డుల‌కెక్కాడు. అశ్విన్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండు సెంచ‌రీల‌తో పాటు 4 సార్లు ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గ‌జం ఇయాన్ బోథ‌మ్ పేరిట ఉండేది. బోథ‌మ్ లీడ్స్‌లో రెండు సెంచ‌రీల‌తో పాటు 3 సార్లు 5 వికెట్ల ఘ‌న‌త సాధించాడు. తాజా మ్యాచ్‌తో బోథ‌మ్ ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.

Share