ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేత టీమ్ ఇండియా తుపానులో చిక్కుకుపోయింది. బార్బడోస్‌లోని హోటల్ గదుల్లో టీమ్ ఇండియా సభ్యులు రెండ్రోజులుగా బందీలుగా మిగిలిపోయారు. టీమ్ ఇండియా బృందం యోగక్షేమాల్ని బీసీసీఐ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటోంది.జూన్ 29న బార్బడోస్ వేదికగా జరిగిన టీమ్ ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ పోరులో గెలిచి విజేతగా విజయగర్వంతో మాతృభూమిలో అడుగుపెట్టాల్సిన రోహిత్ సేన హోటల్ గదుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బార్బడోస్‌లో హరికేన్ బెరిల్ కారణంగా మొత్తం జట్టు సభ్యులు చిక్కుకుపోయారు. ప్రచండవేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాలతో పరిస్థితి భయానకంగా ఉంది. విమానాశ్రయాలు మూసివేశారు. దాంతో టీమ్ ఇండియా బయలుదేరాల్సిన విమానం కూడా రద్దయిపోయింది.వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో ప్రత్యేక విమానంలో కూడా రప్పించలేని పరిస్థితి. బార్బడోస్ సహా చుట్టుపక్కల విద్యుత్ సరఫరా, నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దాంతో టీమ్ ఇండియా సభ్యులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు. బయటకు రాలేని పరిస్థితి. విమానాశ్రయాలు మూసివేసి ఉండటంతో ఆలస్యమౌతోంది.