Current Date: 05 Oct, 2024

హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి వరకు హోటల్స్ ఓపెన్ కానీ వైన్స్ బంద్!

హైదరాబాద్ కల్చర్‌లో అర్ధరాత్రి వరకు ఛాయ్ తాగడం, బిర్యానీ తినడం అలవాటు. దాంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై నగరంలో అర్థరాత్రి 1 గంట వరకు హోటల్స్ ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. మద్యం షాపులు మినహా హోటల్స్, టీ స్టాల్స్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉండేలా మౌఖిక ఆదేశాలు ఇస్తున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకే నగరవాసులకు హోటల్స్‌లో ఆహార పదార్థాలు, ఛాయ్ అందుబాటులో ఉండేవి. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం రేవంత్.. తాజాగా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ఇకపై అర్థరాత్రి 1 గంట వరకు మద్యం షాపులు తప్ప మిగతా హోటల్స్ నడిపించుకోవచ్చని స్పష్టం చేశారు.  ఒకవేళ వైన్ షాపులకు కూడా అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచే అవకాశం ఇస్తే విచ్చలవిడిగా తాగే అవకాశం ఉంది.  అందుకే దాన్ని మినహాయిస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో రాత్రి 11 గంటలకే రెస్టారెంట్లు, హోటళ్లను గత కొన్నేళ్లుగా పోలీసులు మూసివేస్తూ వచ్చారు.

Share