Current Date: 27 Nov, 2024

శ్రీలంకతో తొలి వన్డే డ్రా ఆఖర్లో చేతులెత్తేసిన భారత్

శ్రీలంక, టీమిండియా మధ్య జరిగిన తొలి వన్డే అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. చాలా రోజుల తర్వాత వన్డేల్లో రసవత్తరమైన మ్యాచ్‌ జరిగింది. సాధారణంగా టీ20ల్లో ఎక్కువగా మ్యాచ్‌ టై అయిందన్న వార్త వింటుంటాం. అయితే నిన్న రాత్రి  జరిగిన తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది.మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులకే ఆలౌట్‌ అవ్వడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది.  శ్రీలంక తక్కువ స్కోరే చేసినా వారి స్పిన్‌కు భారత బ్యాటర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 231 పరుగుల ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 58 పరుగులు చేశాడు. రోహిత్ బాదుడుతో టీమిండియా  10 ఓవర్లలో 71 పరుగులు చేసి సునాయసంగా గెలిచేలా కనిపించింది. అయితే కెప్టెన్ చరిత్ అసలంక స్పిన్నర్లను బరిలోకి దిగడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరికి వన్డే క్రికెట్ చరిత్రలో 44వ టై మ్యాచ్‌ నమోదైంది. మూడు వన్డేల సిరీస్‌‌లో ఇక రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇటీవల జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Share