భారత్‌తో గొడవలొద్దు.. వెనక్కి తగ్గిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే విషయంలో ఎట్టకేలకు పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి ఐసీసీ తప్పించినందుకు నిరసనగా తాము కూడా తప్పుకుంటామని పాక్ బెదిరించినప్పటికీ, ఆ బెదిరింపులకు ఐసీసీ కానీ, బీసీసీఐ కానీ తలొగ్గలేదు. ఒకవేళ టోర్నీని బహిష్కరిస్తే ఐసీసీ నుంచి భారీ జరిమానాలు, ఇతర సిరీస్‌ల రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని అర్థం చేసుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, టోర్నీలో పాల్గొనడమే శ్రేయస్కరమని నిర్ణయించుకుంది. ఈ మేరకు పాక్ జట్టు ఫిబ్రవరి 2న కొలంబోకు బయలుదేరనుంది. దీనికి సంబంధించి పీసీబీ ఇప్పటికే షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇతర దేశాలతో సంబంధాలు చెడకుండా టోర్నీలో ఆడాలని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సూచించారు. ఈ మెగా ఈవెంట్‌లో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో పాక్ తన గ్రూప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఐసీసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీల్లో పాక్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికల్లోనే ఆడుతుంది.