Current Date: 06 Jul, 2024

ఏపీలో మళ్లీ పింఛన్ల పంచాయితీ..టీడీపీలో టెన్షన్!

పీలో పోలింగ్ ముంగిట  పింఛన్ల పంచాయతీ మళ్లీ తెరపైకి వస్తోంది.  మే ఒకటో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో పింఛన్‌దారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని ఏప్రిల్ నుంచి నిలిపివేశారు. దీంతో ఏప్రిల్ నెలలో గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ చేశారు.

మే నెలలో పరిస్థితి ఏంటా అని పింఛన్ దారుల్లో ఆందోళన నెలకొంది. ఎండల తీవ్రత కారణంగా పింఛన్ తీసుకునేందుకు సచివాలయాల వద్దకు వెళ్లిన వృద్ధులు మరణించిన ఘటనలు కూడా ఏప్రిల్ నెలలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎలా అనే సందేహాలు పింఛన్ దారుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలోని పింఛన్‌దారులకు మే నెల పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

ఏప్రిల్ తరహాలోనే పింఛనుదారులను సచివాలయానికి రప్పిస్తే.. పెద్ద ఎత్తున మళ్లీ చర్చ జరిగి ఆ నింద టీడీపీపై పడుతుందని చంద్రబాబు కంగారుపడుతున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పింఛను పంపిణీ చేయాలని అతను డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ఏపీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. దాంతో టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోంది.