తమిళనాడు ఎన్నికల్లో విదేశీయులు ఓటింగ్.. సిరా గుర్తుతో అడ్డంగా బుక్! తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత పౌరసత్వం లేని సుమారు 25 మంది విదేశీయులు నకిలీ పత్రాలను సృష్టించి అక్రమంగా ఓటు వేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని పసిగట్టిన బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించడంతో ఈ మోసం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడ్డ వారిలో అత్యధికులు శ్రీలంక దేశానికి చెందిన వారు కాగా, కొందరు బ్రిటీష్, కెనడియన్ పౌరులు కూడా ఉన్నారు. వీరు ఎన్నికల సమయంలో విదేశీ పాస్పోర్ట్లపై రాష్ట్రానికి వచ్చి, స్థానికంగా ఉన్న అక్రమ మార్గాల ద్వారా ఓటరు గుర్తింపు కార్డులను సంపాదించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విమానాశ్రయాల్లో వారు తిరిగి వెళ్తున్న సమయంలో వారి వేలిపై ఉన్న 'ఓటు సిరా' గుర్తులను చూసి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానించడంతో ఈ అక్రమం వెలుగు చూసింది. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన దర్యాప్తు సంస్థలు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశాయి. ఎన్నికల సమయంలో అక్రమంగా ఓటు వేసి, ఆ తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని చెన్నై, మధురై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర వెనుక ఎవరైనా స్థానిక వ్యక్తుల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.