Current Date: 15 May, 2026

సడన్‌గా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై ఎంతంటే?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఉదయం నుంచి భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై రూ. 3, డీజిల్‌పై రూ. 3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ఈ ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. గత 11 వారాలుగా ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒత్తిడి వల్ల వాహనదారులపై ఈ భారాన్ని మోపాల్సి వచ్చిందని తెలిపాయి. 2022 ఏప్రిల్ నుంచి ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు లేవు. లోక్‌సభ ఎన్నికల ముందు మాత్రం లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించారు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పటికీ, తాజా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమైంది. ధరలు భారీగా పెరుగుతాయనే ముందస్తు వార్తలతో నిన్న రాత్రి నుంచే పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ పోయించుకునేందుకు జనం పోటెత్తడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమివ్వడం వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేసింది.