Current Date: 25 Nov, 2024

Prewedding shoot in operation theatre

కొత్త ఓ వింత.. పాత ఒక రోత అని పెద్దలు ఊరికే అన్నారా? కర్ణాటకలో ఓ డాక్టర్.. కొత్తగా చేయాలని భావించి.. చివరికి తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. వైద్యో నారాయణో హరి’ అంటారు. దేవుడితో సమానంగా భావించే ఓ వైద్యుడు తన వృత్తిధర్మాన్ని మరచి ఏకంగా ఆసుపత్రిలోనే ప్రీవెడ్డింగ్‌ షూట్‌ ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో ఈ సంఘటన జరిగింది. దాంతో వైద్యుడిని తక్షణమే విధుల్లోంచి తొలగించింది.

భరంసాగర్‌ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యుడిగా పనిచేస్తున్న అతడు.. ఆపరేషన్‌ థియేటర్‌ గదినే అందుకు వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇంకేముంది తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశం కావడంతో ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండు రావ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించానని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా నడుచుకోవాలని చెప్పానన్నారు. సామాన్య ప్రజల కోసమే ప్రభుత్వం వైద్య సదుపాయాలు కల్పిస్తోందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని విధి నిర్వహణపై ప్రతిఒక్కరూ దృష్టిసారించాలని మంత్రి పేర్కొన్నారు.