Current Date: 06 Jun, 2026

చిన్న పిల్లోడిని కడుపులో తన్నిన రోబో.. అందరూ షాక్!

చైనాలో సాంకేతికతకు సంబంధించిన ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. హ్యూమనాయిడ్ రోబోల ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్న ఒక చిన్నారిపై రోబో అనుకోకుండా దాడి చేసింది. రోబో కాలితో బలంగా తన్నడంతో ఆ బాలుడు తీవ్ర నొప్పితో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రోబోల ప్రత్యేక ప్రదర్శనను చూడటానికి ఆ పార్కుకు భారీగా ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు తరలివచ్చారు. అక్కడ ఒక హ్యూమనాయిడ్ రోబో మార్షల్ ఆర్ట్స్ (సమర కళల) విన్యాసాలను ప్రదర్శిస్తోంది. ఆ విన్యాసాలను రోబోకు అత్యంత సమీపంలో నిలబడి కొందరు పిల్లలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ రోబో తన కాలును వెనక్కి చాపి గాల్లోకి తన్నే విన్యాసం చేస్తుండగా.. దురదృష్టవశాత్తూ అక్కడ నిలబడిన ఓ బాలుడి కడుపునకు ఆ తన్ను బలంగా తగిలింది.రోబో తన్నడంతో తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన ఆ బాలుడిని అక్కడి అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.