Current Date: 04 Mar, 2026

కాటేసిన పాముతో ఆసుపత్రికి యువకుడు.. రివేంజ్ కాదు సమయస్ఫూర్తి!

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు శివారు ప్రాంతానికి చెందిన ఒక యువకుడు హోటల్‌లో భోజనం చేస్తుండగా, ప్రమాదకరమైన రక్తపింజరి పాము అతడిని కాటు వేసింది. ఆ సమయంలో ఏమాత్రం భయపడకుండా అప్రమత్తమైన యువకుడు, వెంటనే ఆ పామును అక్కడికక్కడే చంపేశాడు. సాధారణంగా పాము కాటుకు గురైన వారు కంగారు పడతారు, కానీ ఈ యువకుడు మాత్రం ఆ పాము కళేబరాన్ని చేత్తో పట్టుకుని నేరుగా కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నాడు. చనిపోయిన పాముతో యువకుడు ఆసుపత్రిలోకి ప్రవేశించడంతో అక్కడున్న రోగులు, వైద్య సిబ్బంది ఒక్కసారిగా హడలిపోయారు. తనను కరిచిన పాము ఏ రకానికి చెందినదో చూపిస్తే సరైన వైద్యం అందుతుందనే ఉద్దేశంతోనే అతను ఇలా చేసినట్లు తెలుస్తోంది. వైద్య సిబ్బంది వెంటనే స్పందించి ఆ యువకుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే పాము విష తీవ్రత దృష్ట్యా, మెరుగైన వైద్యం కోసం అతడిని నెల్లూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. సమయస్ఫూర్తితో పామును గుర్తించినా, ఆసుపత్రికి పామును తీసుకురావడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది.