Current Date: 04 Mar, 2026

టీమిండియా చేతిలో ఓడినందుకు పాక్ క్రికెటర్లకు జరిమానా.. వింత శిక్ష!

పాకిస్థాన్ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 దశలోనే ఇంటిముఖం పట్టడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. టోర్నీలో జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశ చెందిన బోర్డు, ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు భారీ స్థాయిలో ఆర్థిక జరిమానాలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరీ ముఖ్యంగా లీగ్ స్టేజ్‌లో భారత్ చేతిలో చిత్తుగా పాకిస్థాన్ ఓడిపోవడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కో ఆటగాడిపై సుమారు రూ.16 లక్షల వరకు పెనాల్టీ పడే అవకాశం ఉందని పీసీబీ వర్గాలు తెలిపాయి. అయితే, ఆటగాళ్లను ఈ స్థాయిలో ఆర్థికంగా నష్టపరచడం సరైన నిర్ణయమా కాదా అనే అంశంపై బోర్డు ప్రస్తుతం సమాలోచనలు చేస్తోంది. తమ దేశ ప్రభుత్వ పెద్దలు సైతం జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆటగాళ్లకు అన్ని రకాల మద్దతు ఇస్తున్నా పెద్ద టోర్నీల్లో విఫలమై దేశానికి అపకీర్తి తెస్తున్నారని ఒక అధికారి పేర్కొన్నారు. తన చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ, రన్‌రేట్ తక్కువగా ఉండటంతో పాకిస్థాన్‌ సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. అదే సమయంలో న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శనతో ముందంజ వేసింది. జట్టు వైఫల్యానికి బాధ్యులను చేస్తూ రాబోయే రోజుల్లో మేనేజ్‌మెంట్‌లో కూడా కొన్ని కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.