Current Date: 04 Jul, 2024

పూడిమడక ఉప్పుటేరులో చేపలు చచ్చిపోతున్నాయ్

సెజ్ ఫార్మా పరిశ్రమల కాలుష్యం తో పూడిమడక ఉప్పుటేరు ఏకంగా రంగే మారిపోయింది. దీంతో మత్స్యకారుల, ఉప్పు రైతుల జీవనోపాధి లేక లబోదిబోమంటున్నారు.. ఫార్మా పరిశ్రమల వ్యర్థాలను అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లతో  రహస్యంగా పూడిమడక ఉప్పుటేరులో నింపేస్తున్నారని చోడిపల్లి అప్పారావు ఆరోపించారు. రసాయనిక వ్యర్ధాలు, కాలుష్యం నీళ్లతో  ఉప్పు టేరు మొత్తం నిండిపోయిందని అప్పారావు మండిపడ్డారు.  వ్యర్ధాల కారణంగానే.. ఉప్పుటేరులో వింత పాములు కలకలం రేపుతున్నాయి. చేపలు చచ్చి పోతున్నాయి.ఉప్పు పండించలేక రైతుల బతుకులు రోడ్డున పడ్డాయి.ఈసీటీపీ ప్లాంట్  దుర్గంధం వెదజల్లడంతో పూడిమడక, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్,  తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి, ఉప్పుటేరు కాలుష్యం వ్యర్ధాలు వలన నష్టపోయిన మత్స్యకారుల, ఉప్పు కార్మికులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని  ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మత్స్యకారులఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని  చోడిపల్లి అప్పారావు హెచ్చరించారు.