దశాబ్దాలుగా మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న బంధం.. నెల రోజుల వ్యవధిలోనే వైరంగా మారిపోయింది. దానికి కారణం ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వైసీపీ చేరడమే. ఇప్పుడు ఈ చిచ్చు సోషల్ మీడియాలో అభిమానులు గొడవలు పడే స్థాయి నుంచి రెండు ఫ్యామిలీల్లోని హీరోలు ఒకరినొకరు ఇన్‌స్టాలో అన్-ఫాలో చేసుకునే వరకూ వెళ్లింది. ఇంతకీ తప్పు ఎక్కడ జరిగింది? ఈ గొడవకి కారణం ఎవరు? అంటే.. అన్నివేళ్లు బన్నీ, నాగబాబు వైపు చూపిస్తున్నాయి.ఏపీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించి.. పిఠాపురంలో ప్రచారం కూడా చేసింది. కానీ.. ఇదే సమయంలో అల్లు అర్జున్ కర్నూలులోని తన భార్య స్నేహితుడు, వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారానికి వెళ్లాడు. దాంతో ఫ్యాన్స్ రెండుగా విడిపోయి సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు. ఆ గొడవ చల్లారకముందే నాగబాబు తొందరపడి ట్విట్టర్‌లో ‘‘అల్లు అర్జున్ పరాయివాడు’’ అనేలా ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ వదిలాడు. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో నాగబాబుపై అటాక్ చేసి అతను ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడంతో పాటు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డీయాక్టివేట్ చేయాల్సి వచ్చింది.కానీ.. ఎన్నికల ఫలితాల్లో జనసేన 21 సీట్లకి 21 సీట్లు, పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాల్లోనూ ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీ క్రేజ్‌ని అమాతం పెంచేసింది. దెబ్బకి అల్లు ఫ్యామిలీ సైలెంట్ అయిపోయింది. బుధవారం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మెగా ఫ్యామిలీ వచ్చింది. కానీ.. అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఆహ్వానం అందలేదా? లేదా అందినా రాలేదా? అనే విషయం క్లారిటీ లేదు. కానీ.. రెండు ఫ్యామిలీల మధ్య దూరం మాత్రం బాగా పెరిగిపోయింది.