పవన్ కల్యాణ్ మరోసారి అభిమానులపై మండిపడ్డారు. సీఎం సీఎం అంటూ పదే పదే జనసైనికులు నినాదాలు చేయడంతో.. మీరు పదేళ్లుగా ఇలానే అరుస్తూనే ఉన్నారంటూ చిరుకోపంతో కసురుకున్నారు. కానీ తన తక్షణ కర్తవ్యం జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు తేవడమేవడమే తప్ప సీఎం కాదని తేల్చి చెప్పారు.
యలమంచిలిలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘దశాబ్ద కాలంగా మీరు సీఎం సీఎం అని అరుస్తున్నారు. కానీ నేను సీఎం అవుతానో లేదో కాలమే నిర్ణయించాలి. సీఎం అవుతానో లేదో కానీ.. నేను మాత్రం ప్రజలకోసం ఓ కూలీలాగా కష్టపడతా. జనసేనకు గుర్తింపు తీసుకు రావడమే నా తొలి బాధ్యత’’ అన్నారు.
పదేళ్లుగా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఉన్నా కూడా జనసేనకు ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపు లేదు. అందుకే గాజు గ్లాసు గుర్తు ఇప్పటికీ ఫ్రీ సింబల్ గానే ఉంది. పొత్తులో ఉన్నాం, కూటమిలాగా ఏపీలో అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నామని బతిమిలాడుకుంటే ఈసీ కాస్త మినహాయింపునిచ్చింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాల పరిధిలోకి వచ్చే ఇతర నియోజకవర్గాల్లో మాత్రం స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించట్లేదని చెప్పింది. మిగతా చోట్ల స్వతంత్రులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తారు. ఇది ఇప్పుడు కూటమిలో కంగారు పెంచుతోంది.