దేశంలోని ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలను గుర్తించి రిపోర్ట్ ఇచ్చే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా సంచలన విషయాల్ని వెల్లడించింది. తెలంగాణలో రోజురోజుకీ క్షీణించిపోతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఆదాయంలో టాప్‌లో నిలవగా.. ఏపీలో ఇటీవల చిత్తుగా ఓడిపోయిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్-10లో కూడా కనిపించడం లేదు. పార్టీ నిర్వహణలో వైఫల్యమే దీనికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. దేశంలోనే అన్ని ప్రాంతీయ పార్టీల కంటే ఎక్కువ ఆదాయం బీఆర్ఎస్ పార్టీదే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ.737.67 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది. వివిధ రాష్ట్రాల్లోని దాదాపు 57 పార్టీలకుగానూ 39 పార్టీల ఆర్థిక స్థితిగతులను ఏడీఆర్ విశ్లేషించింది. ఇన్‌కం విషయంలో బీఆర్ఎస్ టాప్‌లో ఉండగా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూ.333.45 ఆదాయంతో రెండో స్థానంలో నిలిచింది. ఇక వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాయం కేవలం రూ.79.32 కోట్లు మాత్రమే ఉందని ఏడీఆర్ రిపోర్టులో తేలింది.