అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాలికొండ పంచాయతీ పనసలబంధ గ్రామ పరిసర అటవీ ప్రాంతం లో పోలీసులు మావోయిస్టు డంపును గుర్తించారు. కూబింగ్ చేస్తున్న పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సీనియర్ కేడర్ పెట్టిన డంపుగా గుర్తించి పోలీసులు వెలికి తీశారు. ఇందులో లభించిన వస్తువుల్లో మందు పాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టులకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం సీలేరు పరిసర ప్రాంతాల్లో ఆధారాల కొరకు పోలీసు గాలింపు కొనసాగుతున్నది. పోలీసులు స్వాధీన పరుచుకున్న డంపులో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్ మైన్స్,కెల్ కంపెనీ పేలుడు పదార్థం, 150 మీటర్ల పొడవు కల ఎలక్ట్రికల్ వైర్, ఐదు కేజీల మేకులు, ఇనుప నట్లు, మావోయిస్టు సాహిత్య పత్రాలు లభించాయి.ఈ సందర్భంగా అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్, చింతపల్లి అడిషనల్ ఎఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లా పరిధిలో మావోయిస్టు పార్టీ దాచిన డంపులన్నిటిని అతి త్వరలో రికవరీ చేస్తామని అన్నారు. ఈ విషయమై గిరిజన ప్రజలందరూ ప్రశాంత జీవనాన్ని గడపాలని, మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు కాలం చెల్లినవని, గిరిజన ప్రజలు అందరూ కూడా ఈ మావోయిస్టు పార్టీకి దూరంగా ఉండి వారి యొక్క కుట్రపూరిత ప్రణాలికలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మావోయిష్టు పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని యువతి యువకులందరూ అల్లూరి గిరిజన ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోరారు.