వైయస్ఆర్సీపీ యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌కు పోలీసులు సోమవారం 41-ఎ నోటీసులు జారీచేశారు. సోషల్ మీడియాలో లోకేష్ పై ఈ ఏడాది సెప్టెంబర్ 18న సర్కార్ వారి పేకాట.. అంటూ ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెనికి చెందిన కిషోర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ పోస్టులోని ఆరోపణల్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఎమ్మెల్యేకి సూచించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు రావాలని పోలీసులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. కానీ, నవంబర్ 9న విచారణకు ఆయన హాజరుకాలేదు.ఇప్పుడు కొత్తగా అదే నియోజకవర్గంలోని పుల్లలచెరువులో కూడా ఆయనపై కేసు నమోదైంది. ప్రశ్నించేవారిని గొంతులను నొక్కే ఉద్దేశంతో కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో ఈ చంద్రశేఖర్ కూడా ఒకరు.