జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను గుర్తిస్తూ ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రాలు, గొంతు లేదా ఇతర గుర్తింపు చిహ్నాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని నిరోధించాలని కోరుతూ ఎన్టీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలు వారి ఆస్తి అని, వాటిని ఇతరులు దుర్వినియోగం చేయడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది.ఈ తీర్పు ప్రకారం.. 'ఎన్టీఆర్', 'తారక్', 'జూనియర్ ఎన్టీఆర్' వంటి పేర్లతో పాటు ఆయనకు ఉన్న 'యంగ్ టైగర్', 'మ్యాన్ ఆఫ్ మాసెస్' వంటి బిరుదులను కూడా వాణిజ్యపరంగా వాడకూడదని కోర్టు నిషేధించింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేయడం, ఏఐ ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం లేదా ఆయన ప్రమేయం లేకుండా వస్తువులపై ఆయన చిత్రాలను ముద్రించి లాభపడటం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఇలాంటి కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశించింది.దేశవ్యాప్తంగా అశేష ప్రజాదరణ కలిగిన ఎన్టీఆర్ గుర్తింపును అజ్ఞాత వ్యక్తులు లేదా సంస్థలు అక్రమంగా వాడుకోవడం వల్ల ఆయనకు తీరని నష్టం జరుగుతుందని కోర్టు పేర్కొంది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు ఈ తీర్పు ఒక కీలక మైలురాయిగా నిలిచింది.