కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఈసారి డీఏతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఏడాదిలో రెండుసార్లు డీఏ పెరుగుతుంది. ఇప్పుడు జూలైలో అటు డీఏ ఇటు జీతం రెండూ పెరగనున్నాయి.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతియేటా జనవరి, జూలై నెలల్లో రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా జారీ చేసే ఏఐసీపీఐ సూచీ ప్రకారం డీఐఏ ఎంత పెంచాలనేది నిర్ణయిస్తారు. ఇప్పటికే ఈ ఏడాది జనవరి నెలలో డీఏ 4 శాతం పెంచడంతో 46 శాతం ఉన్న డీఏ కాస్తా 50 శాతానికి చేరుకుంది. ఇప్పుడిదే ఏడాది రెండోసారి అంటే జూలై నెలలో డీఏ పెరగాల్సి ఉంది. ఈసారి కూడా 4 శాతం పెరుగుతుందనేది ఓ అంచనా. డీఏ పెంపుపై నిర్ణయం సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో తీసుకున్నా జూలై నుంచి లెక్కగట్టి ఎరియర్లతో సహా చెల్లిస్తారు. అంటే కనీసం వేతనం 50 వేలు ఉంటే 4 శాతం డీఏ చొప్పున 2 వేల రూపాయలు పెరుగుతుంది.మరోవైపు నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జూలై నెలలో జీతం 3 శాతం పెరుగుతుంది. అంటే 50 వేల రూపాయలు కనీసం వేతనం ఉంటే 1500 రూపాయలు పెరుగుతుంది.