Current Date: 02 Jul, 2024

No more age limit for health insurance

హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చే ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుపై వయోపరిమితిని పూర్తిగా తొలగించింది.

ఇప్పటి వరకు 65 ఏళ్ల వయసు వరకు మాత్రమే కొత్త బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉండేది. అయితే, ఏప్రిల్ 01, 2024 నుండి అమలులోకి వచ్చిన ఇటీవలి మార్పుల తర్వాత, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కొత్త ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడానికి అర్హులు.

"బీమా సంస్థలు అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా ఉత్పత్తులను అందించాలి. బీమా సంస్థలు సీనియర్ సిటిజన్‌లు, విద్యార్థులు, పిల్లలు, ప్రసూతి, కాంపిటెంట్ అథారిటీ ద్వారా నిర్దేశించిన ఏదైనా ఇతర గ్రూపుల కోసం ప్రత్యేకంగా బీమా ఉత్పత్తులను రూపొందించవచ్చు" అని ఐఆర్‌డీఏఐ జారీ చేసిన తాజాగా నోటిఫికేషన్‌లో పేర్కొంది.

క్యాన్సర్, గుండె లేదా మూత్రపిండ వైఫల్యం, ఎయిడ్స్‌ వంటి తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉన్న వ్యక్తులకు పాలసీలు ఇవ్వకుండా బీమా సంస్థలు నిరాకరించడానికి వీల్లేదని ఐఆర్‌డీఏఐ ఇటీవలే ఆదేశాలు చేసింది. ఇక తాజా నోటిఫికేషన్‌లో ఐఆర్‌డీఏఐ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ను కూడా 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గించింది.