Current Date: 04 Jul, 2026

ఈ-రిక్షా బ్యాటరీలు హ్యాక్.. దేశంలో కొత్త దందా వెలుగులోకి!

ఈ-రిక్షాల బ్యాటరీలను రిమోట్ ద్వారా హ్యాక్ చేస్తూ సామాన్య డ్రైవర్లను నిలువుదోపిడీ చేస్తున్న చైనా యాప్‌ల గుట్టును కేంద్ర ప్రభుత్వం రట్టు చేసింది. రోడ్డుపై ప్రయాణికులతో వెళ్తున్న రిక్షాలను బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా అకస్మాత్తుగా షట్‌డౌన్ చేసి, ఆపై వాటిని బాగు చేస్తామంటూ డబ్బులు గుంజుతున్న సైబర్ ముఠాల రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఐటీ శాఖ.. ఇందుకు కారణమవుతున్న షెంజెన్ గ్రీన‌ర్జీ, డేలీ బీఎమ్ఎస్ వంటి పలు చైనా ‘బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను’ దేశంలో తక్షణమే బ్లాక్ చేస్తూ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. లిథియం-అయాన్ బ్యాటరీల ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఈ బీఎంఎస్  యాప్‌లకు కనీస పాస్‌వర్డ్ లేదా పిన్ రక్షణ లేకపోవడాన్ని కేటుగాళ్లు ఆసరాగా చేసుకున్నారు. ఇంటర్నెట్ కూడా అవసరం లేకుండా కేవలం లోకల్ బ్లూటూత్ పరిధి ద్వారా బ్యాటరీలను హ్యాక్ చేస్తున్న కొన్ని వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ కావడంతో ఈ డిజిటల్ దందా బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో కదులుతున్న రిక్షాను ఆపేసి, రూ.200 డిమాండ్ చేసిన ఒక యువకుడిని పోలీసులు విచారించడంతో ఈ చైనా యాప్‌ల ద్వారా సాగుతున్న అంతర్జాతీయ సైబర్ దాడుల లింకు దొరికింది. దేశంలో ఈ-రిక్షాల బ్యాటరీలకు ఎలక్ట్రికల్, మెకానికల్ సేఫ్టీ పరీక్షలు మాత్రమే నిర్వహించడం, సైబర్ సెక్యూరిటీ నిబంధనలను తప్పనిసరి చేయకపోవడమే ఈ లొసుగుకు ప్రధాన కారణమని నిపుణులు తేల్చారు.