ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి విజయవాడ బైపాస్‌లో జరిగిన ఒక చిత్రమైన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాజమహేంద్రవరానికి చెందిన పురోహితుడు దువ్వూరి హరిప్రసాద్ తన చిన్న కుమారుడి వివాహం హైదరాబాద్‌లో ముగించుకుని, పూజ సామగ్రితో కారులో తిరుగుపయనమయ్యారు. మార్గమధ్యంలో గొల్లపూడి బైపాస్ రోడ్డు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి తొలుత ఒక ద్విచక్రవాహనాన్ని, ఆపై అక్కడే ఆగి ఉన్న కంటెయినర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదానికి కారులో ఉన్న ఒక కొబ్బరిబొండం కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కారు మొదట ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సమయంలో, వెనుక సీట్లో ఉన్న కొబ్బరిబొండం ఒక్కసారిగా ఎగిరివచ్చి డ్రైవింగ్ సీట్ కింద ఉన్న బ్రేక్, క్లచ్‌ల మధ్య ఇరుక్కుపోయింది. దీనివల్ల బ్రేక్ వేసే అవకాశం లేకపోవడంతో కారు మరింత వేగంగా వెళ్లి కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హరిప్రసాద్‌తో పాటు ద్విచక్రవాహనదారుడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.