Current Date: 04 Jul, 2026

నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20.. వైభవ్‌ను ఆడిస్తారా?

భారత్, ఇంగ్లాండ్ జట్లు శనివారం మాంచెస్టర్ వేదికగా జరగనున్న రెండో టీ20 పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఐర్లాండ్ సిరీస్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఈ యువ ఆటగాడిని.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సంజు శాంసన్ స్థానంలో ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ధశతకంతో అభిషేక్ శర్మ, నిలకడైన ప్రదర్శనతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె రాణించడంతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది. అయితే, ఇషాన్ కిషన్ నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వేగంగా ఆడలేకపోతుండటం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. మాంచెస్టర్ పిచ్ స్పిన్, పేస్ రెండింటికీ అనుకూలించనుండటంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు అక్షర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లను కొనసాగించే అవకాశముంది. మరోవైపు, ఇంగ్లాండ్ జట్టు భారత్‌కు గట్టి సవాల్ విసిరేందుకు వ్యూహాత్మక మార్పులు చేసింది. తొలి మ్యాచ్‌లో రాణించిన సకిబ్ మహమూద్‌తో పాటు ల్యూక్ వుడ్‌లను పక్కన పెట్టి.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లకు తుది జట్టులో చోటు కల్పించింది.