Current Date: 04 Jul, 2026

ఘనంగా అల్లూరి 129వ జయంతి వేడుకలు

​మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. .ఈ సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. చిన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి భౌతికకాయాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణదేవిపేట లో అల్లూరి సమాధి ఉందని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా జీవో ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కృష్ణదేవిపేట లో అల్లూరి సీతారామరాజు  పార్కును అభివృద్ధి చేశామని, క్షత్రియ సోదరుల సహకారంతో అక్కడ పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. కేడీపేటను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంపీలు, ఇతర పెద్దలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఏటా లంబసింగికి లక్షా అరవై వేల మందికి పైగా పర్యాటకులు వస్తున్నారని, అక్కడికి సమీపంలో ఉన్న కేడీపేట అల్లూరి పార్కుకు కూడా ఆ పర్యాటకులు వచ్చేలా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. పర్యాటకులు నర్సీపట్నం వచ్చి ఆగితే స్థానికంగా వ్యాపారం పెరిగి ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని, అల్లూరి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు.