Current Date: 04 Jul, 2024

రెట్టింపైన బాబు, బాలయ్య ఆస్తులు.. నామినేషన్ లెక్కలివిగో!

ఏపీలో ఎన్నికల వేడి హాట్ సమ్మర్ ను మించిపోతుంది. సరిగ్గా ఎన్నికలకు 22 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. ఇక నిన్నటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడం తో బరిలో నిల్చున్న నేతలు నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు.

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేశారు. వేలాదిగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు అభిమానుల మధ్య ఊరేగింపుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న భువనేశ్వరి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి రూ.931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇది 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

హిందూపురం నుండి నామినేషన్ దాఖలు చేసిన బాలకృష్ణ సైతం తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. మొత్తం బాలయ్య పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు, కొడుకు మోక్షజ్ఞ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు.. బాలయ్యకు రూ.9.9 కోట్లు, భార్య వసుంధరకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు