ఎవడ్రా అమ్మేది..ఎవడ్రా కొనేది..విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు..వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకునేది లేదు..ప్రజల బలిదానాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కును కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడతారా..అంటూ విశాఖలో మంగళవారం నిర్వహించిన ఉత్తరాంధ్రా ప్రజా ర్యాలీకి భారీ మద్దతు లభించింది. విశాఖ ఉక్కు రక్షణకు ఉత్తరాంధ్రా అంటూ జెండాలు రెపరెపలాడాయి. ‘లీడర్’ రమణమూర్తి ఆధ్వర్యంలో ప్రజా, పౌర, విద్యార్థి, సాహితీ, కళా సంఘాలు చేపట్టిన శాంతి ర్యాలీకి ప్రజానీకం హారతి పట్టింది. డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి విశాఖ రైటర్స్ అకాడమీ అధ్యక్షులు, ‘లీడర్’ సంపాదకులు, ఉత్తరాంధ్ర ప్రజా సంఘం కన్వీనర్ వీవీ రమణమూర్తి సహా ప్రముఖులంతా నివాళులర్పించి పాదయాత్ర ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఎల్‌ఐసీ భవనం, ద్వారకానగర్, సంగం శరత్, ఆర్టీసీ కాంప్లెక్సు, ఆశీలుమెట్ట కూడలి మీదుగా జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ సాగింది.