Current Date: 25 Aug, 2026

ఖరగ్‌పుర్–అమరావతి గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న 1,107 కిలోమీటర్ల పొడవైన 4-లైన్ గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌కు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగే ఈ మెగా కారిడార్‌తో ఈశాన్య/తూర్పు భారతదేశంతో ఏపీకి రవాణా అనుసంధానం మరింత బలోపేతం కానుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యధికంగా 457 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోనే నిర్మించనున్నారు. ఏపీలోని ఈ విస్తరణ నిర్మాణానికి సుమారు రూ.32,000 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి కోసం రాష్ట్రంలో భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ముఖ్యంగా మన్యం, గిరిజన, గోదావరి ప్రాంతాల మీదుగా సాగనుంది. అరకు, పాడేరు, చింతపల్లి, జంగారెడ్డిగూడెం, పార్వతీపురం, సాలూరు, గోకవరం, నూజివీడుల మీదుగా ఆగిరిపల్లి వద్ద అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో ఇది అనుసంధానం కానుంది. గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా దీనిని రూపొందిస్తున్నారు.