ఉమెన్స్ ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో భారత్ బోణి కొట్టింది. శుక్రవారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోపాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ దాయాదిపై రికార్డుని మరింతగా మెరుగు పర్చుకుంది. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ మ్యాచులో టాస్ గెలిచిన పాకిస్థాన్ మహిళల జట్టు 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌల్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన మెరుగైన ఆరంభం ఇచ్చారు. కేవలం 9.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసి మ్యాచ్‌ని ఏకపక్షంగా మార్చేశారు. ఆ తర్వాత ఇద్దరూ ఔటైనా భారత్ 14.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలిగింది. మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ దీప్తి శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా అవార్డు లభించింది. టోర్నీలో భాగంగా భారత మహిళల జట్టు తన తర్వాత మ్యాచ్‌ను ఈనెల 21న యూఏఈతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.