సచిన్ టెండూల్కర్ చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు కనిపిస్తోంది. స్కూల్ ఏజ్ క్రికెట్‌లో సచిన్‌తో కలిసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పిన కాంబ్లీ టీమిండియా కూడా సచిన్‌తో కలిసి ఆడాడు. కానీ దురలవాట్లు, క్రమశిక్షణ లేకపోవడంతో అనారోగ్యం బారినపడి ఇప్పుడు కనీసం తనకు తానుగా నడవలేకపోతున్నాడు.ముంబయిలో రోడ్డుపై అడుగులు తడబడి కిందపడే సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు వినోద్ కాంబ్లీని గుర్తించి ఆసరా అందించడంతో ఊపిరిపీల్చుకున్నాడు. భారత్ తరఫున 1993-2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత తాగుడికి బానిసై భారత జట్టులో చోటు కోల్పోయాడు.2013లో చెంబూరు నుంచి కారులో వెళ్తున్న సమయంలో వినోద్ కాంబ్లీకి గుండెపోటు వచ్చింది. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ మరుసటి ఏడాదే ఆంజియోప్లాస్టీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా చితికిపోయాడు. చిన్ననాటి స్నేహాన్ని మరిచిపోని సచిన్ కొన్ని అవకాశాలను కల్పించినా ఇగోతో వాటిని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.