కేవలం ఒక్క రూపాయి కట్నంతోనే పెళ్లి జరిగిపోయింది. ఒక్క రూపాయి దాంతో పాటు ఒక్క కొబ్బరికాయ తప్ప ఇంకేమీ తీసుకోకుండానే తన కొడుకుకు పెళ్లి చేశాడు ఓ తండ్రి.
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఉన్న మధుబన్ ప్రాంతానికి చెందిన భూర్ సింగ్ రనౌత్.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైరయ్యారు. ఆయన తన కుమార్తె మధు పెళ్లిని, జైపూర్‌కు చెందిన మహేంద్ర సింగ్ రాథోడ్ కుమారుడు అమృత్ సింగ్‌తో ఫిక్స్ చేశారు.పెళ్లి కొడుకు తన తండ్రితో కలిసి ఊరేగింపుగా ఫంక్షన్ హాల్‌కు వచ్చాడు. రాజ్‌పుత్ సమాజంలో పెళ్లికి ముందు తిలక్ దస్తూర్ అనే ఆచారం ఉంటుంది.
తిలక్ దస్తూర్‌గా వధువు తండ్రి భూర్ సింగ్, ఆయన సోదరుడు పర్వత్ సింగ్ కలిసి వరుడు అమృత్ సింగ్‌కు రూ. 11 లక్షలు అందించారు. ఆ వెంటనే వరుడి తండ్రి మహేంద్ర సింగ్ రాథోడ్ రూ.11 లక్షలను వధువు తండ్రి భూర్ సింగ్‌కు తిరిగి ఇచ్చేశారు. అయితే వధువు తరఫు వారు బలవంతం చేయడంతో గౌరవ సూచకంగా ఒక్క రూపాయి, కొబ్బరికాయను మాత్రమే స్వీకరించారు. దీంతో అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టి వరుడి తండ్రిని అభినందించారు.