ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కష్టాలు వీడటంలేదు. అరెస్టై నాలుగు నెలలు గడుస్తున్నా కవితకు ఈకేసులో బెయిల్ లభించలేదు. దీంతో బెయిల్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తోంది. తాత్కాలిక బెయిల్ కోసం కవిత తరపు న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ కోసం కవిత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. నిర్ణీత వ్యవధిలోగా సీబీఐ దర్యాప్తు పూర్తిచేయలేకపోడంతో తమ క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. వెంటనే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.