Current Date: 26 Nov, 2024

కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు నమోదు

సార్వత్రిక ఎన్నికల ముంగిట కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణా విజయన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. వీణాకి చెందిన ఐటీ కంపెనీ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఈడీ ఆరోపిస్తోంది. గత కొంతకాలంగా ఆ ఐటీ కంపెనీ నుంచి నిబంధనలకు విరుద్ధంగా వీణా ఆర్థిక చెల్లింపులు చేసిన‌ట్లు ఈడీ పేర్కొంది.

సీఎం విజ‌య‌న్ కూతురు వీణాకు ఎక్సాలాజిక్ అనే ఐటీ కంపెనీ ఉంది. దాంతో  కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ తదితర కంపెనీలు ఆమెకు ఉన్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన అనుమానాస్పద చెల్లింపులపై ఆదాయ ప‌న్ను శాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ విచారణ జరిపి కేసు నమోదు చేసింది.

వీణాకి చెందిన కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ 2018 నుంచి 2019 వరకు వీణా కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్‌కు రూ.1.72 కోట్ల అక్రమ చెల్లింపు చేసిందని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.

ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా వీణాపై ఈడీ కేసు నమోదు చేయడంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి.