సాధారణంగా ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే లీవ్స్ ఎన్నో రకాలు ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు సిక్ లీవ్స్ ఇస్తారు. ప్రతినెలా కంపెనీ ఇచ్చే ఒక లీవ్‌ను క్యాజువల్ లీవ్స్ అంటారు. గర్భిణులైన మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ కంపెనీ యువ ఉద్యోగుల కోసం వెరైటీ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది.
ప్రేమలో ఫెయిలయ్యే యువతకు రెస్ట్ ఇచ్చేందుకు బ్రేకప్ లీవ్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ సంచలన నిర్ణయం తీసుకున్న కంపెనీ పేరు.. ‘స్టాక్ గ్రో’. ఇది ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ.లవ్ బ్రేకప్ జరగడంతో గుండె చెదిరిపోయిన భగ్న ప్రేమికులకు అండగా నిలిచేందుకు స్టాక్ గ్రో కంపెనీ బ్రేకప్ లీవ్స్‌ను ప్రవేశపెట్టింది. బ్రేకప్ అయ్యాక.. రిలాక్స్‌డ్‌గా టైం గడిపేందుకు, మనసును బలంగా చేసుకునేందుకు ఈ లీవ్ దోహదం చేస్తుందని ఆ కంపెనీ చెబుతోంది.
కొందరు ఉద్యోగులు బ్రేకప్ వల్ల పడిన మనో వేదనను పరిగణనలోకి తీసుకొని.. బ్రేకప్ లీవ్స్ పాలసీని తమ హెచ్ఆర్ విధానంలో జోడించామని చెప్పారు. లవ్ బ్రేకప్ అనే కారణంతో లీవ్ పెడితే.. ఇక వివరణ అడగబోమని, రుజువులు చూపించాల్సిన అవసరం కూడా లేదని వారం రోజులు నిరభ్యంతర సెలవు ఇస్తున్నట్లు స్టాక్ గ్రో కంపెనీ వెల్లడించింది.